మేం ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి: శశి థరూర్
- కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యత
- ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసిన శశి థరూర్
- సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ 71ని సునాయాసంగా దాటేసింది. ఈ విజయంతో కేరళలో ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన ధర్మదంలో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ చేతిలో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పినరయి విజయన్‌తో పాటు పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉండటం ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది.
ఈ ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. కేరళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తాము ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ ఇస్తూ.. తమ వద్ద సమర్థులైన నేతలు చాలా మంది ఉన్నారని, ఫలితాల అనంతరం ఎమ్మెల్యేలతో చర్చించి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు ఎల్డీఎఫ్ కేవలం 40 స్థానాలకే పరిమితం కాగా, ఎన్డీయే ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కేరళ ఓటర్ల తీర్పుతో యూడీఎఫ్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది.